16వ ఆసియా క్రీడల్లో భారత్ మెరిసింది. ఇప్పటి వరకు దేశం పాల్గొన్న ఏషియాడ్‌లలో అత్యధిక పతకాలను ఈ క్రీడల్లో సాధించి అత్యుత్తమ ప్రదర్శనను భారత్ నమోదు చేసింది. మొత్తం 64 (స్వర్ణం 14, రజతం 17, కాంస్యం 33) పతకాలు సాధించి 28 ఏళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 57 (స్వర్ణం 13, రజతం 19, కాంస్యం 25) పతకాల రికార్డును అధిగమించింది. అంతేకాకుండా, పతకాల పట్టికలో ఆరవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. దీనితో దాదాపు 25 ఏళ్ల క్రితం 1986 సియోల్ ఏషియాడ్ తరువాత భారత్‌కు అత్యుత్తమ స్థానం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సియోల్ ఆసియా క్రీడల్లో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 37 పతకాల్ని సాధించి ఐదవ స్థానాన్ని భారత్ సాధించింది. నాలుగేళ్ల క్రితం దోహాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 10వ స్థానం లభించింది. ఈ నెల 12న ఘనంగా ప్రారంభమైన ఈ క్రీడల చివరి వారం రోజుల్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, టెన్నిస్, రోయింగ్ క్రీడాంశాల్లో అథ్లెట్లు రాణించడంతో భారత్ అత్యధిక పతకాల్ని సాధించడమే కాకుండా, పూర్తి సంతృప్తితో ఈ క్రీడల్లో పోరాటాన్ని ముగించింది. మొత్తం మీద భారత్ ఆయా క్రీడాంశాల విషయానికి వస్తే, అథ్లెటిక్స్‌లో 5, బాక్సింగ్, టెన్నిస్‌ల్లో చెరో రెండు, కబడ్డీలో మరో రెండు స్వర్ణ పతకాలు భారత్‌కు లభించాయి. ఈ క్రీడల్లో బిలియర్డ్స్ డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వాని దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టగా, వరల్డ్ నంబర్1 బాక్సర్ విజేందర్ సింగ్ 14వ స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశాడు.
అద్వాని నుంచి విజేందర్ దాకా...
ఈ క్రీడల్లోని కొన్ని క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ ఛాంపియన్ పంకజ్ అద్వాని అందరు అనుకున్నట్లుగానే స్వర్ణాన్ని నెగ్గి తన హోదాను కాపాడుకోవడంతో పాటు దేశానికి తొలి స్వర్ణాన్ని అందించగా, షాట్‌గన్ షూటర్ సోధి పురుషుల డబుల్ ట్రాప్ ఈవెం ట్లో రెండో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. అనంతరం రో యింగ్ బరిలోకి దిగిన థక్క ర్ దేశానికి మూడో స్వర్ణాన్ని సాధించాడు. సొంత బోట్లు లేక అద్దెకు తెచ్చుకున్న బోట్లతో మరో భారత ఆటగాడు బజరంగ్‌లాల్ థక్కర్ రోయింగ్‌లో తొలి పసిడి పతకాన్ని సాధించి చరిత్ర పుటలకెక్కాడు.
టెన్నిస్‌లో టాప్‌సీడ్ సోమ్‌దేవ్ అద్భుతమైన ఆట తీరుతో పురుషుల సింగిల్స్‌తో పాటు, డబుల్స్ విభాగంలో లో భారత్‌కు రెండు స్వర్ణాల్ని అందించాడు. స్టార్ బాక్సర్ విజేం దర్ సింగ్ (75 కేజీలు) భారత్‌కు ఈ క్రీడల్లో చివరి స్వర్ణాన్ని అందించాడు. మరో యువ బాక్సర్ వికా స్ కృష్ణన్ (60 కేజీలు) కూడా తన ప్రత్యర్థిని ఓడిం చి పసిడిని కైవసం చేసుకున్నాడు. భారత పురుషుల కబడ్డీ జట్టు వరుసగా ఆరవసారి స్వర్ణాన్ని సాధించి డిఫెండింగ్ చాంపియన్ హోదాను కాపాడుకోగా, తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో బోణీ చేసింది. పురుషుల ఫైనల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్ జట్టును భారత్ ఓడించగా మహిళల ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌పై భారత మహిళల జట్టు విజయం సాధించింది.
అథ్లెటిక్స్‌లో కర్ణాటకకు చెందిన అశ్విని అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ 400 మీటర్ల హర్డిల్స్, 4/400 మీటర్ల రిలేలో రెండు స్వర్ణ పతకాలను నెగ్గి రికార్డు సృష్టించింది. అంతకుముందు మహిళా అథ్లెట్లు ప్రీజా శ్రీధరన్ (3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్), సుధా సింగ్ (10 వేల మీటర్లు) రెండు స్వర్ణాలను సాధించి శుభారంభాన్ని ఇచ్చారు. అనంతరం పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కేరళకు చెందిన జోసెఫ్ అబ్రహాం 28 ఏళ్ల తరువాత దేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సాధించిపెట్టాడు. గతంలో 1982లో స్వదేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన చార్లెస్ బొరోమియా 800 మీటర్ల పరుగు పందెంలో దేశానికి పతకాన్ని సాధించిపెట్టాడు. మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో దేశానికి కాంస్య పతకాల్ని సాధించిపెట్టింది. ఆర్చరీలో భారత ఆటగాడు తరుణ్‌దీప్ రాయ్ అద్భుత ప్రతిభ కారణంగా వ్యకిగత విభాగంలో తొలి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
